ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌ లో భారీగా అమ్ముడుపోని ఇళ్లు, కారణం ఇదే

updated: March 5, 2018 13:40 IST

హైదరాబాద్‌లో దాదాపు 28,000  ఇళ్లు అమ్ముడుపోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే వార్తే. ఎప్పుడూ అమ్మేవారు, కొనేవారు,మధ్యవర్తులతో హాడావిడిగా ఉండే రియల్ ఎస్టేట్ మార్కెట్ దాదాపు కూలబడింది. అయితే ఇది కేవలం హైదరాబాద్ కే పరిమితం కాలేదు.  దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా ఏడు అతిపెద్ద పట్టణాల్లో 2017 ఆఖరుకు 4.4 లక్షల నివాస భవనాలు అమ్ముడుపోకుండా మిగిలి ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది.హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కత్తా ఈ జాబితాలో ఉన్నాయి.  ఇది ఆందోళన కలిగించే విషయమేనా అంటే కాదంటున్నారు. ధరలు స్దిరంగా ఉండటానికి కారణం ఇదే అంటున్నారు.

 

వీటిలో ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోనే అమ్ముడు కాని 1.5 లక్షల ఫ్లాట్లు ఉన్నాయని  జేఎల్‌ఎల్‌ ఇండియా  పేర్కొంది. చెన్నైలో విక్రయం కాకుండా మిగిలిపోయిన వాటిలో ఎక్కువ యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నవేనని జేఎల్‌ఎల్‌ తెలిపింది. కోల్‌కత్తాలో అతి తక్కువగా 26,000 యూనిట్లే మిగిలిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్‌ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ విక్రయం కాని ఇళ్లు, ఫ్లాట్లు 28,000. ముంబైలో 86,000, బెంగళూరులో 70,000, పుణేలో 36,000 మిగిలిపోయాయి ధరలు స్థిరంగా ఉండడంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో విక్రయాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. 

జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ మాట్లాడుతూ ‘నివాస గృహాల మార్కెట్‌ కొంతకాలం వేచి చూసే ధోరణిలో కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యాపారంలో వచ్చిన కొత్త నిబంధనలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావం కూడా గృహ నిర్మాణ రంగంపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరూ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సాహసం చేయకపోవడంతో మిగిలినవి రాబోయే త్రైమాసికాల్లో అమ్ముకొనే వీలుంద’ని అన్నారు. 

 

comments